రాష్ట్ర ప్రభుత్వం మటన్ అమ్మడం ఏంటండీ.. నీచంగా!: రఘురామకృష్ణరాజు

09-09-2021 Thu 19:20
  • ఏపీలో మటన్ మార్ట్ లు
  • రాష్ట్ర ప్రభుత్వ యోచన
  • ఎద్దేవా చేసిన రఘురామ
  • జగనన్న మాంసం దీవెన అంటూ వ్యంగ్యం
Raghurama Krishnaraju comments on govt mutton marts

ఇప్పటికే మద్యం అమ్మకాలను నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మటన్ విక్రయాలకు రంగం సిద్ధం చేస్తోంది. మటన్ మార్ట్ ల పేరిట త్వరలోనే ప్రభుత్వ మాంసం విక్రయశాలలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న మాంసం దీవెన అంటూ ఎద్దేవా చేశారు. "రాష్ట్ర ప్రభుత్వం మటన్ అమ్మడం ఏంటండీ... నీచంగా!... రాష్ట్ర ప్రభుత్వం మాంసం విక్రయిస్తుందా... ఛీ!" అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ క్రమంలో ఓ దినపత్రికలో మటన్ మార్ట్ లకు సంబంధించిన కథనాన్ని లైవ్ లో చదివి వినిపించారు. ఇలాంటి వ్యాపారాలకు బదులు రైతులు పండించే కూరగాయలకు మెరుగైన ధరలు లభించేలా చూడాలని హితవు పలికారు. ప్రభుత్వం మటన్ బదులు కూరగాయలు అమ్మితే ఆ పథకం కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ పథకానికి జగనన్న కాయగూర దీవెన అని పేరుపెట్టుకోవాలని సూచించారు.