హిందీ నటిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పాకిస్థాన్ కోర్టు

09-09-2021 Thu 19:00
  • చిక్కులు తెచ్చిన మ్యూజిక్ వీడియో
  • చారిత్రక మసీదు ఎదుట చిత్రీకరణ
  • డ్యాన్స్ సన్నివేశాల చిత్రీకరణ
  • పోలీసులకు ఫిర్యాదు
  • కోర్టు విచారణకు హాజరుకాని నటి
Pakistan court issues arrest warrant on hindi medium actress Saba Qamar

పాకిస్థాన్ లో హిందీ భాషా మాధ్యమంలోనూ సినిమాలు, ఇతర వినోదభరితమైన కార్యక్రమాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో హిందీ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సబా ఖమర్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆమెకు పాకిస్థాన్ లోని లాహోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది సబా ఖమర్ పై ఓ డ్యాన్స్ వీడియో చిత్రీకరించారు. అయితే చారిత్రక వజీర్ ఖాన్ మసీదు ముందు ఆమె డ్యాన్సులు చేస్తున్న సన్నివేశాలు చిత్రీకరించారంటూ ఫిర్యాదు చేయగా, లాహోర్ పోలీసులు సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు.

సబాతో పాటు గాయకుడు బిలాల్ సయీద్ కు పలుమార్లు నోటీసులు పంపినా కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో, బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాగా, పవిత్రమైన మసీదు ముందు కుప్పిగంతులు వేశారంటూ సబా ఖమర్, బిలాల్ సయీద్ పై పాక్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా  రావడంతో వారిద్దరూ పలుమార్లు క్షమాపణలు చెప్పారు. కాగా సబా ఖమర్ స్పందిస్తూ తాము చిత్రీకరించింది ఓ పెళ్లి సన్నివేశమని వివరించారు.