Kannababu: టీడీపీలో తన నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులు లేనందునే లోకేశ్ ఈ నాటకాలు ఆడుతున్నారు: ఏపీ మంత్రి కన్నబాబు

  • ఏపీలో పరిస్థితులపై నిలదీస్తున్న లోకేశ్
  • ఇవాళ గన్నవరం వద్ద అడ్డుకున్న పోలీసులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్
  • అదే రీతిలో స్పందించిన కన్నబాబు
  • చంద్రబాబు స్క్రీన్ ప్లే... లోకేశ్ యాక్టింగ్ అంటూ వ్యాఖ్యలు
Kannababu fires on Nara Lokesh and Chandrababu

రాష్ట్రంలో మహిళలపై జరిగిన పలు ఘటనల పట్ల టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ తమ ప్రభుత్వాన్ని తప్పుబడుతుండడంపై మంత్రి కన్నబాబు స్పందించారు. చంద్రబాబుకు, లోకేశ్ కు ప్రజలపై నిజంగా ప్రేమ లేదని ఆరోపించారు. మహిళల భద్రత గురించి ఎవరో చెబితే నేర్చుకోవాల్సిన స్థితిలో తమ ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు.

ఏదైనా ఘటన జరిగినప్పుడు తాము ఎలా స్పందిస్తున్నామన్నది అందరికీ తెలుసని అన్నారు. లోకేశ్ చేస్తున్న అల్లరి అంతా తండ్రి చంద్రబాబు ఇచ్చిన శిక్షణ ఫలితమేనని కన్నబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రీన్ ప్లేలో లోకేశ్ నటిస్తున్నాడని వ్యాఖ్యానించారు.  

"గతంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగితే మా నాయకుడు వెళితే కేసులు పెట్టింది ఎవరి ప్రభుత్వం? మా నేతను రన్ వేపైనే ఆపేసి దారుణంగా వ్యవహరించింది ఎవరు? నాడు కాపులు కంచాలు మోగిస్తే వేలమందిపై కేసులు పెట్టింది ఎవరు?" అంటూ కన్నబాబు టీడీపీ అధినాయకత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రజస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తోందని ఉద్ఘాటించారు.

తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులు లేకపోవడంతో ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని కన్నబాబు విమర్శించారు. లోకేశ్ ను ఇవాళ గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. దీనిపై లోకేశ్ తో పాటు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News