త్వరలో క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బయోపిక్

09-09-2021 Thu 14:22
  • భారత్ క్రికెట్ చరిత్రలో గంగూలీకి ప్రత్యేక స్థానం
  • దాదాగా క్రికెట్ వర్గాల్లో పేరు
  • బయోపిక్ కు ముందుకొచ్చిన లవ్ రంజన్, అంకుర్ గార్గ్
  • త్వరలో మరిన్ని వివరాల వెల్లడి
Biopic confirmed on Sourav Ganguly

భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించిన దిగ్గజం సౌరవ్ గంగూలీ. ఆటగాడిగా, కెప్టెన్ గా జట్టుకు దూకుడు నేర్పిన ఈ బెంగాల్ టైగర్ జీవితం ఆధారంగా ఇప్పుడు ఓ సినిమా రానుంది. గంగూలీ బయోపిక్ ను నిర్మించేందుకు నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ముందుకొచ్చారు. లవ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

గంగూలీ క్రికెట్ జీవితంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ కావలసినంత డ్రామా ఉంది. గతంలో ఓ సినీ తారతో ప్రేమాయణం నడిపినట్టు ఇటు క్రికెట్ లోకం, అటు సినిమా ప్రపంచంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. మరోవైపు, తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం గంగూలీ కెరీర్ లో మరో ముఖ్యఘట్టం. ఈ లవ్ ఎపిసోడ్ ఏ సినిమా కథకు తీసిపోదు.

ఇక, లార్డ్స్ మైదానంలో చొక్కా విప్పి గిరగిరా తిప్పడం, ఆసీస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా అంతటివాడిని టాస్ సమయంలో తనకోసం వేచిచూసేలా చేయడం గంగూలీ కెరీర్ లో కొన్ని ముఖ్యాంశాలు. ఆటపరంగా చూస్తే రికార్డులు, ఘనవిజయాలు ఎన్నో గంగూలీని విశిష్ట వ్యక్తిగా మలిచాయి. ఈ నేపథ్యంలో గంగూలీ బయోపిక్ లో ఏమేం అంశాలు ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.