Team India: భారత జట్టుది ప్రపంచ స్థాయి బ్యాటింగ్ లైనప్: ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్

  • కోహ్లీ సేన బ్యాటింగ్‌ లైనప్‌పై ప్రశంసలు
  • బౌలర్లు సరిగా రాణించకపోతే శిక్ష తప్పదన్న పేసర్
  • భారత పేస్ దళంపై గౌరవం ఉందన్న ఇంగ్లిష్ ప్లేయర్
England pacer Markwood says India got a world class batting lineup

భారత జట్టు వద్ద ప్రపంచ స్థాయి బ్యాటింగ్ లైనప్ ఉందని ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్ కొనియాడాడు. మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు జరగనున్న నేపథ్యంలో అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా భారత జట్టు గురించి చెబుతూ.. ‘‘వారిది ప్రపంచ స్థాయి బ్యాటింగ్ లైనప్ అని నేను అనుకుంటున్నా. వాళ్ల బ్యాట్స్‌మెన్ జాబితా చూసుకుంటూ పోతే.. అతను అద్భుత ఆటగాడు, ఇతను గొప్ప ప్లేయర్ ఇలానే చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది’’ అని అన్నాడు.

అలాంటి వారికి బౌలింగ్ చేసే సమయంలో బౌలర్లు క్రమశిక్షణ కోల్పోతే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించాడు. ప్రస్తుతం 5 మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన మార్క్‌వుడ్.. కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడని, ముఖ్యంగా అతను బంతులు వదిలేసిన విధానం గొప్పగా ఉందని చెప్పాడు. అదే సమయంలో రోహిత్ శర్మకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా బౌలింగ్ చేయడం కష్టమని అభిప్రాయపడ్డాడు. అందుకే భారత ఓపెనర్లు తమకు చాలా పెద్ద వికెట్లని తెలిపాడు.

వాళ్ల తర్వాత పుజారా, కోహ్లీ వస్తారని చెప్పాడు. ఏ ఫార్మాట్‌లో అయినా తాను బౌలింగ్ చేయడానికి కష్టపడాల్సిన ఆటగాడని కోహ్లీకి కితాబునిచ్చాడు. కాబట్టి భారత జట్టుది ప్రపంచ స్థాయి బ్యాటింగ్ లైనప్ అని అన్నాడు. అయితే వారి వికెట్లు తీయగలమనే నమ్మకంతోనే తాము మైదానంలో దిగుతామని, లేదంటే ఆడటం కుదరదని చెప్పాడు.

More Telugu News