వైసీపీ మంత్రి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లడాన్ని ప్రజలంతా గమనించాలి: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

08-09-2021 Wed 15:25
  • ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది
  • మంత్రులు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు
  • బాలినేని చీమకుర్తి జనార్దన్ రెడ్డిగా తయారయ్యారు
Minister Balineni flying in special flights says CPI Ramakrishna

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశీ ప్రయాణం వివాదాస్పదమవుతోంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక విమానంలో బాలినేని విదేశాలకు వెళ్లడాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని... ప్రతిరోజు అప్పులు తీసుకుంటూ ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోందని విమర్శించారు. పెన్షన్లు కూడా పెంచకుండా కుదిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని... అక్రమ సంపాదన లేకపోతే ఇలా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

సాధారణంగా మంత్రులు, ముఖ్య అధికారులు విదేశాలకు వెళ్లేటప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణిస్తారని.. కానీ, ఏపీలో మాత్రం ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారని... దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని రామకృష్ణ చెప్పారు. బళ్లారి ప్రాంతంలో ఇనుప గనులను గాలి జనార్దన్ రెడ్డి కొల్లగొట్టినట్టు... ప్రకాశం జిల్లా చీమకుర్తి అడ్డాగా మంత్రి బాలినేని గ్రానైట్ గనులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చీమకుర్తి జనార్దన్ రెడ్డిగా బాలినేని తయారయ్యారని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.