Telangana: కరోనా మూడో వేవ్​ ముంచుకొస్తోంది.. చర్యలేవీ?: తెలంగాణ సర్కార్​ పై హైకోర్టు మండిపాటు

High Court Hearings On Covid Situation In Telangana
  • ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ డీహెచ్ నివేదిక
  • అసంతృప్తి వ్యక్తం చేసిన సీజే ధర్మాసనం
  • తాము ఆదేశించినా చర్యలు తీసుకోరా? అని ఆగ్రహం
కరోనా మూడోవేవ్ ముంచుకొస్తోందని, ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా మూడోవేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు కోర్టుకు నివేదిక సమర్పించారు.

అయితే, ప్రభుత్వ స్పందనపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే కరోనాతో చాలా మంది చనిపోయారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా నష్టం జరగకుండా చూడాలని సూచించింది. చాలా రాష్ట్రాల్లో మూడో వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, అక్కడ కేసులు పెరిగిపోతున్నాయని గుర్తు చేసింది.

తాము ఆదేశించినా ఇంతవరకు నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించలేదని, వారంలోగా కమిటీ భేటీ అయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. జనగామ, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండల్లో కేసుల పాజిటివిటీ రేటు ఒకశాతం కన్నా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ ఆదేశాలనైనా అమలు చేయాలని, లేదంటే కోర్టుకు రావాల్సి ఉంటుందని డీహెచ్, కేంద్ర నోడల్ అధికారిని హెచ్చరించింది.
Telangana
TS High Court
High Court
COVID19
Corona Virus

More Telugu News