Hockey: హాకీని జాతీయ క్రీడగా ప్రకటించాలన్న పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court rejects petition seeking directives to declare hockey as national game
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాది తివారీ
  • హాకీ మసకబారిపోతోందని వెల్లడి
  • కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • ఆదేశాలు ఇవ్వలేమన్న త్రిసభ్య ధర్మాసనం
చాలామంది భారత జాతీయ క్రీడ ఏదంటే హాకీ అని చెబుతారు. కానీ అది నిజం కాదు. పేరుకే కానీ హాకీ అధికారికంగా జాతీయ క్రీడ కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా గతంలో కేంద్రం ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో హాకీని భారత జాతీయ క్రీడగా ప్రకటించాలంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో కోరారు.

అయితే, ఈ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రానికి ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. న్యాయవాది తివారీ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడి ధర్మాసనం విచారించింది.

దేశానికి జాతీయ జంతువు ఉన్నప్పుడు జాతీయ క్రీడ ఎందుకు ఉండకూడదని పిటిషనర్ తివారీ ప్రశ్నించారు. క్రీకెట్ నీడలో హాకీ ప్రాభవం మసకబారిపోతోందని, అటు కేంద్రం నుంచి తోడ్పాటు కూడా లేదని తెలిపారు. క్రికెట్ పరంగానూ, మేధాపరంగానూ, నాయకత్వ పరంగానూ భారత్ రాణిస్తోందని, కానీ ఇతర అంశాల్లో మాత్రం చాలా వెనుకబడి ఉందని తివారీ వివరించారు.

దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో తాము చేయడానికి ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్ ను మీరు ఉపసంహరించుకుంటారా? లేక మమ్మల్మే కొట్టేయమంటారా? అని పిటిషనర్ కు సూచించింది.

అయితే, పిటిషనర్ పరిస్థితి పట్ల తమకు సానుభూతి ఉందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి అంశాల్లో ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందని, మేరీకోమ్ వంటి వారు ప్రతికూలతలను సైతం ఎదుర్కొని ఉన్నతస్థాయికి ఎదిగారని ప్రస్తావించింది. ఇది అందరు క్రీడాకారులకు వర్తిస్తుందని పేర్కొంది. కాగా, కోర్టు సూచనతో న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.
Hockey
National Game
Supreme Court
India

More Telugu News