లేడీ కానిస్టేబుల్ కు సీమంతం జరిపిన ఇతర పోలీసులు

07-09-2021 Tue 19:14
  • సీమంతానికి వేదికగా గురజాల పోలీస్ స్టేషన్
  • కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బంగారమ్మ
  • సీమంతానికి హాజరైన ఉన్నతాధికారులు
  • అందరికీ కృతజ్ఞతలు తెలిపిన బంగారమ్మ
Seemantham for a lady constable in Gurajala police station
గుంటూరు జిల్లా గురజాల పోలీస్ స్టేషన్ ఓ సీమంతం కార్యక్రమానికి వేదికైంది. సీమంతం జరిపించుకున్నది ఎవరో కాదు... అదే స్టేషన్లో పనిచేసే ఓ లేడీ కానిస్టేబుల్. ఆమె పేరు తోట బంగారమ్మ. గత మూడేళ్లుగా గురజాల పీఎస్ లో ఆమె పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అందరితోనూ శభాష్ అనిపించుకునే బంగారమ్మను ఇతర కానిస్టేబుళ్లు ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే గర్భవతి అయిన బంగారమ్మకు సీమంతం జరిపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల డీఎస్పీ మెహర్ జయరాం హాజరయ్యారు. గురజాల టౌన్ సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. తోటి సిబ్బంది సమక్షంలో సీమంతం జరుపుకోవడం పట్ల కానిస్టేబుల్ బంగారమ్మ సంతోషంతో పొంగిపోయారు. అధికారులకు, సహచర కానిస్టేబుళ్లకు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.