AP Govt: ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంలో హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఏపీ సర్కారు నిర్ణయం

AP Govt decides to file review petition on high court orders in fees reimbursement
  • ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం
  • విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్
  • ఇప్పటివరకు తల్లుల ఖాతాల్లో నగదు వేస్తున్న సర్కారు
  • ఇకపై కాలేజీలకు నేరుగా చెల్లించాలన్న హైకోర్టు
ఏపీలో జగనన్న విద్యా దీవెన పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నగదును తల్లుల ఖాతాల్లోకి కాకుండా నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయాలంటూ ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు. పారదర్శకత కోసమే తల్లుల ఖాతాలో నగదు జమ చేసే విధానానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నామని, రెగ్యులేటరీ కమిషన్ ఫీజులు నిర్ణయించిన తర్వాత 4 విడతల్లో ఫీజులను చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ పథకం గతంలో మాదిరే అమలు చేసేలా తాజా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరతామని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టుకు పూర్తి సమాచారం అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.

అటు, ఇంటర్ ప్రవేశాలకు ఆన్ లైన్ విధానం వద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపైనా మంత్రి స్పందించారు. హైకోర్టు తీర్పునకు సంబంధించిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదని చెప్పారు.
AP Govt
Reimbursement
Fees
AP High Court
YSRCP
Andhra Pradesh

More Telugu News