Cricket: శార్దూల్​ ఠాకూర్​ పై రోహిత్​ ప్రశంసల వర్షం

Rohit Sharma Expresses Gratitude Over Shardul Thakur Performance
  • నాతో పాటు శార్దూల్ కూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సింది
  • అతడిది మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన
  • మ్యాచ్ గతినే మార్చేసే స్థాయికి ఎదిగాడు
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో భారత్ విజయంలో రోహిత్ శర్మ సెంచరీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, రెండు ఇన్నింగ్సుల్లోనూ ఇటు బ్యాటుతో, అటు బంతితో రాణించిన శార్దూల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ నూ తక్కువ చేయలేం. మొదటి ఇన్నింగ్స్ లో అతడి మెరుపు అర్ధ శతకం, రెండో ఇన్నింగ్స్ లో మరో అర్ధ శతకం, క్రీజులో పాతుకుపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ వికెట్ తీయడం.. వంటివీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మకైతే ఇచ్చారుగానీ.. అంతే సమానంగా శార్దూల్ ఠాకూర్ కూడా దానికి అర్హుడే. ఇదే విషయాన్ని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు. శార్దూల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. శార్దూల్ మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’కు అతడే అర్హుడని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగులకు ఒక్క వికెట్ కూడా పడకుండా పటిష్ఠ స్థితిలో ఉన్న ఇంగ్లండ్ ను దెబ్బ తీసి, టీమ్ కు మొదటి వికెట్ అందించాడని అన్నాడు. అంతేగాకుండా క్రీజులో పాతుకుపోయిన జో రూట్ వికెట్ తీసి విజయానికి బాటలు వేశాడని గుర్తు చేశాడు.

రెండు ఇన్నింగ్స్ లలో అతడి బ్యాటింగ్ ను ఎలా మరచిపోగలమని, మొదటి ఇన్నింగ్స్ లో 31 బంతుల్లోనే 50 పరుగులు చేసి టీంకు గౌరవప్రదమైన స్కోరునందించడంలో కీలక పాత్ర పోషించాడని రోహిత్ ప్రశంసించాడు. బ్యాటింగ్ నైపుణ్యాలను పెంచుకునేందుకు అతడు బాగా కష్టపడుతున్నాడని అన్నాడు. ఇప్పుడతను మ్యాచ్ గతినే మార్చేయగల స్థాయికి ఎదిగాడని కొనియాడాడు. కాబట్టి తనతో పాటు శార్దూల్ కు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చి ఉంటే బాగుండేదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
Cricket
Rohit Sharma
Shardul Thakur
Team India
England

More Telugu News