Andhra Pradesh: మర్యాదగా ఆ నాలుగు ట్రాక్టర్లను వదిలేయండి.. లేదంటే మంత్రినని కూడా ఆలోచించను: ఆస్పరి ఎస్సైని హెచ్చరించిన మంత్రి జయరాం ఆడియో వైరల్

  • పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలని  హెచ్చరిక
  • లేదంటే మంత్రినని కూడా చూడకుండా ధర్నాకు కూర్చుంటానన్న మంత్రి
  • ఆ రెండు చానళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
Minister Jayaram warns Aspari SI to release Tractors

కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైని హెచ్చరిస్తూ ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పిరి మండల పరిధిలోని యాటకల్లుకు చెందిన దాదాపు 40 ట్రాక్టర్ల యజమానులు, కార్యకర్తలు ఆలూరులో ఇటీవల మంత్రిని కలిశారు. పోలీసులు తమ ట్రాక్టర్లను పట్టుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో మంత్రి జయరాం నేరుగా ఆస్పరి ఎస్సై‌కి ఫోన్ చేసి, స్పీకర్‌ ఆన్ చేసి, వారి ముందే మాట్లాడారు. నాలుగు ఖాళీ ట్రాక్టర్లను పట్టుకున్నట్టు తెలిసిందని, వెంటనే వదిలేయాలని ఎస్సైతో మంత్రి అన్నారు. వదలకుంటే తాను మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు.

తనకు జనమే కావాలని, తాను ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాలని పేర్కొన్న మంత్రి..  ట్రాక్టర్లను వదిలిపెడతారో, ధర్నాకు కూర్చునేలా చేస్తారో తేల్చుకోవాలని హెచ్చరించడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆదోని ట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోలుకుంటున్నాయని, ఆస్పరి వాళ్లను మాత్రం ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇసుక ఉంటే విలేకరులెవ్వరూ చూడకపోతే వదిలిపెట్టి ఏదో యవ్వారం చేసుకోవాలని ఎస్సైకి సూచించారు. అక్కడితో ఆగక మన తాలూకాలో ఎక్కడా బతకలేని పరిస్థితి అంటూ ఫోన్ పెట్టేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి స్పందించారు. తాను బీసీ వర్గానికి చెందిన వాడిని కావడంతో తనపై కావాలనే రెండు మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఖాళీ ట్రాక్టర్లను స్టేషన్ కు తీసుకెళ్లారని గ్రామస్థులు చెప్పడంతో.. తాను ఎస్సైతో మాట్లాడానని  మంత్రి చెప్పారు.

More Telugu News