TDP: పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయం.. ఇద్దరు టీడీపీ సానుభూతిపరుల ఆత్మహత్యాయత్నం

Two TDP Supporters attempt to suicide in prakasam dist
  • ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఘటన
  • గొడవకు వీడియోనే కారణమని గుర్తించిన పోలీసులు
  • వీడియో తీసిన ఇద్దరికీ స్టేషన్‌కు రావాలంటూ పోలీసుల పిలుపు
  • భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయంతో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిన్న ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లాలోని లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఉన్న 4 సెంట్ల భూమికి సంబంధించి టీడీపీ, వైసీపీ సానుభూతిపరుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాలు ఈ నెల 4న లింగసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిచారు. ఈ క్రమంలో వైసీపీ సానుభూతి పరులకు మద్దతుగా వెళ్లిన కె.కొండలరావు గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు వేముల గోపాల్‌ను దుర్భాషలాడారు. ఇదంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన పల్లపోతు రత్తయ్య గోపాల్‌కు పంపారు.

ఇది చూసిన గోపాల్ ఆదివారం కొండలరావును నిలదీయడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ తోసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం 11 మంది టీడీపీ, ఐదుగురు వైసీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేశారు. అదే రోజు రాత్రి గోపాల్ సహా మరికొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అర్ధరాత్రి గడుస్తున్నా విడుదల చేయకపోవడంతో ఆయనకు మద్దతుగా వెళ్లిన మరికొందరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

గోపాల్‌ను తిడుతుండగా రికార్డు చేసి పంపడమే వివాదానికి కారణమని తేల్చిన పోలీసులు ఇందుకు కారణమైన రత్తయ్య, శ్రీకాంత్‌లను స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. దీంతో స్టేషన్‌కు వెళ్తే తమను ఎన్‌కౌంటర్ చేయడం ఖాయమని భయపడిన రత్తయ్య, శ్రీకాంత్ కాకర్లపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అపస్మారక స్థితిలో పడివున్నవారిని గమనించిన స్థానికులు వారిని తొలుత వలేటివారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆ తర్వాత అక్కడి నుంచి కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాసులు.. తాము చట్టప్రకారమే ముందుకెళ్తున్నామని, తమ వేధింపుల వల్లే వారు పురుగుల మందు తాగారని ఆరోపించడం సరికాదని అన్నారు.
TDP
Prakasam District
Mogilicharla
Suicide
YSRCP

More Telugu News