Team India: నాలుగో టెస్టు మనదే... కోహ్లీ సేన సూపర్ విక్టరీ

  • ఓవల్ టెస్టులో టీమిండియా ఘనవిజయం
  • 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
  • 368 పరుగుల లక్ష్యఛేదనలో 210కి ఆలౌట్
  • సమష్టిగా సత్తాచాటిన భారత బౌలర్లు
  • సిరీస్ లో 2-1తో భారత్ ముందంజ
  • ఈ నెల 10 నుంచి చివరి టెస్టు
Team India beat England by huge margin

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా మరో ఘనవిజయం నమోదు చేసింది. ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో 157 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 368 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ ను 210 పరుగులకే చుట్టేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్రజడేజా 2 వికెట్లు తీశారు. ఐదో రోజు ఆటలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ్ 10 వికెట్లు చేజార్చుకుని ఘోర పరాజయం చవిచూసింది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో పుంజుకున్న టీమిండియా 466 పరుగులు నమోదు చేసి, ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట చివరికి ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా 77 పరుగులు చేసిన ఆతిథ్య ఇంగ్లండ్, చివరిరోజు ఒత్తిడికి లోనై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.  

ఈ సిరీస్ లో తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టును భారత్ నెగ్గింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. తాజా విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఈ నెల 10 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

More Telugu News