Misbah Ul Haq: టీ20 వరల్డ్ కప్ ముంగిట పాకిస్థాన్ క్రికెట్లో సంక్షోభం

  • కోచ్ పదవి నుంచి తప్పుకున్న మిస్బా
  • బౌలింగ్ కోచ్ పదవికి వకార్ రాజీనామా
  • ఇటీవల పీసీబీ చైర్మన్ గా రమీజ్ రాజా నియామకం
  • గతంలో మిస్బా, వకార్ లను విమర్శించిన రమీజ్
Misbah and Waqar stepped down as coaches for Pakistan national cricket team

అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం రేగింది. పాక్ జాతీయ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి మిస్బావుల్ హక్ అనూహ్యంగా వైదొలిగాడు. బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ కూడా మిస్బా బాటలోనే పదవికి రాజీనామా చేశాడు. టీ20 వరల్డ్ కప్ కు నెల ముంగిట ఈ పరిణామం పాక్ క్రికెట్ ను కుదిపేసింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెంటనే రంగంలోకి దిగింది. మిస్బా, వకార్ స్థానంలో మాజీ క్రికెటర్లు సక్లాయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్ లను తాత్కాలిక కోచ్ లు గా నియమించింది. వీరిద్దరూ న్యూజిలాండ్ తో సిరీస్ లో పాక్ జట్టుకు కోచ్ లు గా వ్యవహరిస్తారు.

ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజాను పీసీబీ కొత్త చైర్మన్ గా నియమించారు. గతంలో రమీజ్ రాజా తన యూట్యూబ్ చానల్లో మిస్బా, వకార్ ల పనితీరును ఏకిపారేశాడు. వారిద్దరూ పాక్ జట్టుకు అత్యుత్తమ కోచ్ లు కాలేరని విమర్శించాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ కు కుర్రాళ్లు, పవర్ హిట్టర్లతో కూడిన పాక్ జట్టును ప్రకటించగా, జట్టు ఎంపికపై రమీజ్ రాజా ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే మిస్బా, వకార్ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

రాజీనామా అనంతరం మిస్బా ఓ ప్రకటన చేశాడు. కరోనా సమయంలో కుటుంబంతో కలిసి సురక్షితంగా ఉండేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. అటు వకార్ స్పందిస్తూ... తాను, మిస్బా కలిసే కోచ్ లుగా వచ్చామని, ఇప్పుడు కూడా కలిసే రాజీనామాలు చేశామని తెలిపాడు. మిస్బావుల్ హక్, వకార్ యూనిస్ 2019 సెప్టెంబరులో కోచ్ లుగా పదవులు చేపట్టారు. కాంట్రాక్టు ప్రకారం వారు మరో ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది.

More Telugu News