Nipah Virus: ​కేరళలో నిపా వైరస్ కలకలం... రాష్ట్రానికి కేంద్ర నిపుణుల బృందం

  • కోజికోడ్ లో 12 ఏళ్ల బాలుడి మృతి
  • తీవ్ర జ్వరంతో ఆసుపత్రిపాలైన బాలుడు
  • చికిత్స పొందుతూ ఆదివారం మృతి
  • గతంలోనూ కేరళలో నిపా వైరస్ విజృంభణ
Nipah Virus spotted again in Kerala

ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న కేరళలో తాజాగా నిపా వైరస్ ఉనికి మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో కేరళలో అనేకమందిని బలిగొన్న నిపా వైరస్ మరోసారి వెలుగుచూసింది. నిపా వైరస్ తో ఓ బాలుడు మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

కొన్నిరోజుల కిందట 12 ఏళ్లు బాలుడు తీవ్ర జ్వరంతో కోజికోడ్ ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యుల చికిత్స ఫలించలేదు. ఆదివారం ఆ బాలుడు కన్నుమూశాడు. అతడు నిపా వైరస్ తో మరణించాడని నిర్ధారణ అయింది. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించిన పూణేలోని జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ నిపుణులు నిపా వైరస్ గా ధ్రువీకరించారు.

కాగా, బాలుడితో సన్నిహితంగా ఉన్న 150 మందిని గుర్తించారు. వారిలో 20 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నట్టు భావిస్తున్నారు. బాలుడికి వైద్య చికిత్స అందించిన ఇద్దరికి కూడా నిపా లక్షణాలు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్యశాఖకు సహకారం అందించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ఓ ప్రత్యేక బృందాన్ని పంపింది.

2018లో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కేరళలోని కోజికోడ్ లోనే నిపా కేసు నమోదైంది. అప్పట్లో నెలరోజుల వ్యవధిలో 17 మంది చనిపోయారు. నిపా వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సంక్రమిస్తుందని పరిశోధకులు గుర్తించారు. నిపా వైరస్ మొట్టమొదటిసారిగా 1999లో మలేసియాలో వెలుగుచూసింది.

More Telugu News