ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం... విపక్షాలకు తలసాని సవాల్

05-09-2021 Sun 18:51
  • 'దళిత బంధు'పై విపక్షాల విమర్శలు
  • తీవ్రంగా స్పందించిన మంత్రి తలసాని 
  • మూర్ఖులు అంటూ మండిపడిన వైనం
  • కళ్లులేని కబోదులు అంటూ ఆగ్రహం
Minister Talasani Srinivas challenges opposition leaders
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధును విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తుండడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కనీసం తాడు, బొంగరం లేని వాళ్లు కూడా సీఎం కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏడేళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, విపక్షాలకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. దళితబంధుపై ప్రతిపక్ష నేతలు మూర్ఖంగా వాదిస్తున్నారని తలసాని విమర్శించారు.

"దళిత బంధు జిల్లాల్లోనూ అమలు చేయాలని, రాష్ట్రమంతా అమలు చేయాలని అంటున్నారు. ఎవరైనా ఒక్క నియోజకవర్గంలో అమలు చేసి వదిలేస్తారా? ఇలాంటి మూర్ఖులను ఎక్కడా చూడబోం, కళ్లులేని కబోదులు" అంటూ మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండడం తెలిసిందే.