Afghanistan: కన్న తండ్రే తాలిబన్లకు పట్టించిన వైనం.. మహిళా పోలీస్​ ను కత్తులతో పొడిచి.. తలలో కాల్చి.. కళ్లు పీకిన ఉగ్రవాదులు!

  • ఏడాది క్రితం దారుణ ఘటన
  • మెరుగైన చికిత్స కోసం ఇటీవలే భారత్ కు
  • ఆ లోపే ఆఫ్ఘన్ ను ఆక్రమించేసుకున్న తాలిబన్లు
  • తనకు ఎదురైన నరకాన్ని వెల్లడించిన ఖతేరా హష్మి
  • పోలీస్ కావడం తన తండ్రికి ఇష్టం లేదని ఆవేదన
  • తాలిబన్లు మారారనడం అపోహేనని కామెంట్
Afghan Ex Woman Cop Explains The Cruelty That She Faces By Taliban They Gouged Her Eyes Out

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ నైతే ఆక్రమించేశారు. మహిళలను చదువుకోనిస్తామని, ఉద్యోగాలు చేయనిస్తామనీ చెప్పారు. మరి, నిజంగానే వారు మారారా? వారి మాటలను నమ్మొచ్చా? అంటే కాదనే చెప్పాలి. అందుకు ఖతేరా హష్మీ అనే ఓ మహిళా పోలీస్ అధికారికి తాలిబన్ల నుంచి ఎదురైన నరకమే ఉదాహరణ. 20 ఏళ్ల క్రితం తాలిబన్లు ఎంత క్రూరంగా ఉన్నారో.. ఇప్పుడూ అంతే క్రూరంగా ఉన్నారనేందుకు నిదర్శనం ఆమె దీనగాథ. ఇప్పటి ఆమె మొహమే తాలిబన్ల కర్కశత్వానికి నిలవెత్తు సాక్ష్యం. ప్రస్తుతం భారత్ లో శరణార్థిగా ఉంటున్న ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏడాది క్రితం తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

ఏడాది క్రితం గర్భవతిగా ఉన్న తనను తాలిబన్లు కిడ్నాప్ చేశారని చెప్పారు. ‘‘మహిళలు బయట అడుగుపెట్టడమన్నా.. స్కూలుకెళ్లి చదువుకోవడమన్నా.. ఉద్యోగం చేయడమన్నా.. అత్యంత పాపం. నన్ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. అత్యంత పాశవికంగా హింసించారు. తలలో ఎన్నో బుల్లెట్లు పేల్చారు. నా కళ్లు పీకి రాక్షసానందం పొందారు. ఇది నా ఒక్కదాని సమస్యే కాదు.. ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రతి మహిళ పరిస్థితీ అదే. మారామని వారు చెబుతున్నా.. వారిలోని క్రూరత్వం ఇంకా అలాగే ఉంది’’ అని ఖతేరా చెప్పారు.  

కన్న తండ్రే కిడ్నాప్ చేయించాడు

తనపై ఇంత క్రూరమైన దాడి చేయించింది స్వయానా తన కన్న తండ్రేనని ఖతేరా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నేను పోలీస్ అధికారి కావడం మా నాన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. వద్దన్నాడు. తాలిబన్లకు నన్ను మా నాన్నే పట్టించాడు. నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఆ రోజు నేను డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్నాను. అప్పటికే మా ఇంటి వద్ద ఉన్న ముగ్గురు తాలిబన్ ఉగ్రవాదులు.. నన్ను కత్తులతో పదిపోట్లు పొడిచారు. తుపాకులతో తలపై కాల్చారు. అది చాలదన్నట్టు.. కత్తులతో నా కళ్లు పీకేశారు’’ అని ఆమె తాలిబన్ల కర్కశత్వాన్ని వివరించారు.

ఎలాగోలా తనను కొందరు కాబూల్ లోని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు బతికించారని చెప్పారు. అయితే, కంటి చూపు మాత్రం తిరిగి రాదని చెప్పారన్నారు. ఇప్పుడు తాను ఓ బతికున్న శవాన్ని మాత్రమేనన్నారు. ఏదో బతుకుతున్నానంటే బతుకుతున్నాను తప్ప.. కష్టాలు లేని రోజంటూ తన జీవితంలో లేదని చెప్పారు. చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా ఎంతో కష్టపడాల్సి వస్తోందన్నారు.

మెరుగైన చికిత్స కోసం భారత్ కు వచ్చానని, ఆ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయని ఖతేరా చెప్పారు. తన పిల్లలు ఆఫ్ఘనిస్థాన్ లోనే ఉన్నారని, వారిని తాలిబన్లు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం పిల్లలకు ఫోన్ చేస్తే.. పగలు, రాత్రి అనే తేడాల లేకుండా ఉగ్రవాదులు ఇంటికి వచ్చి వెళుతున్నారని తెలిసిందన్నారు.

తాను, తన భర్త ఎప్పుడు తిరిగి వస్తారంటూ తన పిల్లలను ఉగ్రవాదులు అడుగుతున్నారని చెప్పారు. అప్పట్నుంచి తన పిల్లలతో మాట్లాడలేదని, వారు బతికున్నారో లేదా చనిపోయారో కూడా తెలియదని అన్నారు. తాను బతికే ఉన్నానని తెలిసి తాలిబన్లు వెతుకుతున్నారని, ఇప్పుడు తాను ఆఫ్ఘన్ వెళితే చంపేస్తారని భయాందోళనకు గురైంది. తాలిబన్లు మారారన్నది నమ్మలేమని, మహిళలకు హక్కులు కల్ల అని ఖతేరా స్పష్టం చేశారు.

More Telugu News