Chinthamaneni Prabhakar: రాష్ట్రంలో ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు ఉండగా నా పేరు వాడాల్సిన పనేంటి?: ఏపీ డీజీపీకి చింతమనేని ప్రశ్న

  • మీడియా సమావేశంలో యాప్ పనితీరు వివరించిన డీజీపీ
  • చింతమనేని పేరుతో సెర్చ్
  • కేసుల వివరాలన్నీ వచ్చాయని వివరణ
  • చింతమనేని ఆగ్రహం
Chintamaneni fires on AP DGP Goutham Sawang

మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి, ఎవరిదైనా నేర చరిత్ర తెలుసుకోవడం ఎలాగో యాప్ ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో ఎంటర్ ప్రైజెస్ సెర్చ్ లో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పేరు టైప్ చేసి ఆయనపై ఉన్న కేసుల వివరాలను మీడియా ప్రతినిధులకు డెమో ఇచ్చారు. చింతమనేని బాగా ఫేమస్ కాబట్టి ఆయన పేరు సెర్చ్ లో కొడుతున్నానని వెల్లడించారు.

అయితే, నేర చరిత్రలు తెలుసుకునేందుకు తన పేరును వాడడం పట్ల చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్నటి మీడియా సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తానొక డీజీపీ అన్న విషయం మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎంతోమంది ఉండగా, కేసుల వివరాలు చెప్పడానికి నా పేరు ఎందుకు ఉపయోగించారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పే కట్టుకథలను డీజీపీ బాగా వంటబట్టించుకున్నారని, అక్రమ కేసుల సినిమాలు చూపించడంలో డీజీపీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించిపోయారని అన్నారు.

"నాపై నమోదైన కేసుల్లో ఎన్ని ఇప్పటికీ నడుస్తున్నాయో డీజీపీ చెప్పాలి. కొన్ని కేసులు చార్జిషీట్లు వేయలేక మూసేశారు. వాటిపై ఏం సమాధానం చెబుతారు? టీడీపీ శ్రేణులను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు నన్ను ఒక బంతిలా వాడుకోవాలనుకుంటున్నారు. కేసులు ఏవీ దొరక్క... రండి, చింతమనేనిపై కేసులు పెట్టండి అంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకిలేస్తా" అని చింతమనేని స్పష్టం చేశారు.

"తప్పుడు కేసులకు భయపడేది లేదు. డీజీపీకి వైసీపీ అంటే అంత వ్యామోహం ఉంటే ఆ రుణం మరో రూపంలో తీర్చుకోవాలే తప్ప, నా వంటి వారితో చెలగాటాలు వద్దు. డీజీపీ పదవిని కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు" అన్నారు చింతమనేని.

More Telugu News