USA: 9/11 దాడుల దర్యాప్తు రహస్య వివరాలను బయటపెట్టండి.. అధికారులను ఆదేశించిన బైడెన్​

  • ఆరు నెలల్లో పూర్తి వివరాలను వెల్లడించాలని ఉత్తర్వులు
  • పూర్తి పారదర్శకంగా సాగాలని సూచన
  • బాధిత కుటుంబాల బాధ వర్ణనాతీతమని ఆవేదన
  • బాధిత కుటుంబాల ఒత్తిడితో తాజా నిర్ణయం
  • హైజాకర్లతో సౌదీకి సంబంధాలున్నాయని అప్పట్లో ఆరోపణలు
Biden Orders To Release Classified Data Of WTC Attacks

9/11 దాడులపై అమెరికా దర్యాప్తునకు సంబంధించి రహస్య సమాచారాన్ని ఆ దేశం బయటపెట్టనుంది. ఈ మేరకు కొన్ని నెలల్లో విడతల వారీగా ఆ సమాచారాన్నంతా బయటపెట్టాల్సిందిగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ (వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ ఆఫీస్)పై 2001 సెప్టెంబర్ 11న అల్ ఖాయిదా ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడిలో అధికారిక లెక్కల ప్రకారం 3 వేల మంది మరణించారు. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం మరణాలు 10 వేలకుపైనే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా.

అయితే, ఇప్పటికీ ఆ ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తు వివరాలను అమెరికా ప్రభుత్వం వెల్లడించలేదు. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులతో సౌదీఅరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు వివరాలను బయటపెట్టాలంటూ బాధిత కుటుంబాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ వివరాలను బయటపెట్టాలని ఆదేశిస్తూ ఇవాళ బైడెన్ ఆదేశాలిచ్చారు.

‘‘ఎఫ్ బీఐ దర్యాప్తునకు సంబంధించి వివరాలను బయటపెట్టాలని న్యాయశాఖను ఆదేశించాను. దానికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశాను’’ అని ఆయన ప్రకటించారు. ఆరు నెలల్లోపు విడతలవారీగా అన్ని వివరాలను బయటపెట్టాలని స్పష్టం చేశారు. ఉగ్రదాడుల్లో అయినవారిని కోల్పోయిన కుటుంబాల బాధను మనం ఎప్పటికీ మరవద్దని ఆయన కోరారు. వివరాలను బహిర్గతం చేసే క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News