KTR: కేన్స‌ర్ రోగుల‌కు ఉచిత చికిత్స‌... ఖాజాగూడ‌లో 'స్పర్శ్‌ హాస్పిస్‌' ప్రారంభించిన‌ మంత్రి కేటీఆర్‌

  • కొన్నేళ్లుగా బంజారాహిల్స్ లో అద్దె భ‌వ‌నంలో సేవ‌లు
  • ఇప్పుడు ఖాజాగూడలో ఎక‌రం స్థ‌లంలో కొత్తగా భ‌వ‌నం
  • 33 ఏళ్ల‌ పాటు లీజుకు ఇచ్చిన‌ ప్రభుత్వం
  • అధునాతన సౌక‌ర్యాల‌తో 82 పడకలు
ktr inaugurates cancer service center

కేన్స‌ర్ రోగుల‌కు చికిత్స అందించ‌డం కోసం హైద‌రాబాద్ శివారులోని ఖాజాగూడలో నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. కేన్సర్ తో బాధపడుతూ చివరి దశలో వుండే రోగులకు ఈ ‘స్పర్శ్‌ హాస్పిస్‌’ ఉచిత వైద్య సేవలు సమకూరుస్తూ, ఆత్మీయ స్పర్శను అందిస్తుంది.

కొన్నేళ్లుగా రోటరీ క్లబ్‌-బంజారాహిల్స్ నేతృత్వంలో  రోడ్‌ నం.12లోని అద్దెభవనంలో స్పర్శ్‌ హాస్పిస్ సేవ‌లు అందిస్తోంది. ఇప్పుడు  ఖాజాగూడలో ఎక‌రం స్థ‌లంలో కొత్తగా నిర్మించిన భవనంలోకి దాన్ని మార్చారు. దీంతో కేన్స‌ర్ రోగుల‌కు మ‌రిన్ని సేవ‌లు అంద‌నున్నాయి.  

ఈ ఎక‌రం స్థలాన్ని 33 ఏళ్ల‌ పాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ ఆసుప‌త్రిలో అధునాతన సౌక‌ర్యాల‌తో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా 10 పడకలు ఉన్నాయి. ఈ ఆసుప‌త్రికి ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి కూడా రోగులు వ‌స్తుంటారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఆశయం, ఆలోచ‌న‌లు మంచివైనప్పుడు సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని అన్నారు. దీనికి గొప్ప ఉదాహరణ స్పర్శ్‌ హాస్పిస్ అని చెప్పారు. ఐదేళ్ల‌లోనే స్పర్శ్‌ హాస్పిస్‌కు మంచి భవనం దొర‌కడం సంతోషకరమని చెప్పారు. రోటరీ క్లబ్‌ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు. అలాగే, స్పర్శ్‌ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్‌ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని ప్ర‌క‌టించారు.

More Telugu News