Paralympics: పారాలింపిక్స్​ మెన్స్​ షూటింగ్​ లో స్వర్ణం, రజతం మనవే!

  • 50 మీటర్ల మిక్స్ డ్ విభాగంలో పోటీలు
  • బంగారు పతకం సాధించిన మనీశ్ నర్వాల్
  • తొలి పారాలింపిక్స్ లోనే ఘనత సాధించిన 19 ఏళ్ల కుర్రాడు
  • రజతంతో మెరిసిన సింగ్ రాజ్ అధానా
  • ఈ ఒలింపిక్స్ లో రెండో పతకం
  • బ్యాడ్మింటన్ లో మరో రెండు పతకాలు పక్కా
Manish and Adhana Creates History By winning Gold and Silver Paralympics Shooting

పారాలింపిక్స్ లో భారత షూటర్లు సంచలనం సృష్టించారు. 50 మీటర్ల మిక్స్ డ్ ఎస్ హెచ్1 విభాగంలో స్వర్ణ, రజత పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. ఇవాళ జరిగిన ఈవెంట్ లో మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలిచాడు. 19 ఏళ్ల నర్వాల్ కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం.

ఇక, ఇదే విభాగంలో సింగ్ రాజ్ అదానా 216.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. చైనా షూటర్ల నుంచి గట్టిపోటీ ఎదురైనా వారిని వెనక్కు నెట్టేశారు. రష్యాకు చెందిన సెర్జె మేలిషెవ్ 196.8 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. దీంతో ఈ పారాలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 15కి పెరిగింది. ఇప్పటిదాకా మూడు స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలను మన క్రీడాకారులు సాధించారు.

పారాలింపిక్స్ లో భారత్ కు మొదటి స్వర్ణాన్ని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవనీ లేఖర అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమీత్ ఆంటిల్.. జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని సాధించాడు. ఇప్పుడు మనీశ్ నర్వాల్ స్వర్ణాన్ని గెలిచాడు. మరోవైపు బ్యాడ్మింటన్ లోనూ మరో రెండు పతకాలు దాదాపు ఖాయమైనట్టే.


ప్రమోద్ భగత్ ఎస్ఎల్3 (సింగిల్ లెగ్) విభాగంలో ఫైనల్ కు చేరాడు. ఎస్హెచ్6 (సింగిల్ హ్యాండ్) విభాగంలో కృష్ణా నగార్ కూడా ఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు. సుహాస్ యతిరాజ్ మెన్స్ సింగిల్స్ లో కాంస్య పతకం పొందే మ్యాచ్ లోకి వెళ్లాడు. దాంతో పాటు మనోజ్ సర్కార్, తరుణ్ దిల్లాన్, ప్రమోద్ భగత్–పాలక్ కోహ్లీలు కాంస్య పతక మ్యాచ్ ను ఆడనున్నారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లను పక్కన పెడితే రెండు పతకాలు (స్వర్ణం లేదా రజతం) ఖాయమయ్యాయి.

స్వర్ణ, రజత పతకాలు సాధించిన మనీశ్ నర్వాల్, సింగ్ రాజ్ అదానాలను ప్రధాని నరేంద్ర మోదీ, ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రాలు అభినందనలతో ముంచెత్తారు. పారాలింపిక్స్ లో భారత చరిత్ర వెలిగిపోతోందని ప్రధాని మోదీ అన్నారు. స్వర్ణం గెలిచి మనీశ్ నర్వాల్.. భారత క్రీడల్లో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించాడని కొనియాడారు. అధానా మరో పతకాన్ని సాధించి తనేంటో మరోసారి నిరూపించాడని మెచ్చుకున్నారు. ఆయన సాధించిన ఘనతతో భారత్ ఎంతో ఆనందిస్తోందన్నారు.

‘‘భారత్ కు మొదటి రెండు స్థానాలు. కలలకు ప్రతిరూపమిది. స్వర్ణం గెలిచి మనీశ్ నర్వాల్, ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి అధానాలు చరిత్ర సృష్టించారు. మేమందరం మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’’ అని బింద్రా ట్వీట్ చేశాడు.

More Telugu News