ఎత్తిపోసిన నీళ్లన్నీ సముద్రం పాలు చేసే మహా అద్భుతం కాళేశ్వరం: షర్మిల వ్యంగ్యం

  • సీఎం కేసీఆర్ పై షర్మిల విమర్శలు
  • రీడిజైనింగ్ పేరుతో దోచుకుంటున్నారని వ్యాఖ్యలు
  • ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని వెల్లడి
  • మరోసారి దోపిడీకి సిద్ధమయ్యాడని ఆగ్రహం
YS Sharmila comments on CM KCR

కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు బంగారు గుడ్లు పెట్టే బాతు అని అభివర్ణించారు. కమీషన్లకు కక్కుర్తిపడి రీడిజైనింగ్ పేరుతో రూ.36 వేల కోట్లకు పూర్తయ్యేదాన్ని లక్ష కోట్లకు పెంచాడని ఆరోపించారు. తద్వారా వేలకోట్లు దండుకున్నాడని తెలిపారు.

గడచిన మూడేళ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, 2 వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు మాత్రం వచ్చిందని వెల్లడించారు. ఎత్తిపోసిన నీళ్లన్నీ సముద్రం పాలు చేసే మహా అద్భుతం కాళేశ్వరం అంటూ షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు.

తన అవినీతి అంతా ప్రజలకు తెలిసిపోయిందని, మళ్లీ తాను గెలవడం కష్టమని భావించి ఇప్పుడు కొత్తగా మూడో టీఎంసీ అంటూ తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. దీని ద్వారా మరో రూ.30 వేల కోట్ల మేర అంచనాలు పెంచి దోచుకునేందుకు సిద్ధమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News