దేశం దాటేందుకు కాబూల్​ ఎయిర్​ పోర్ట్​ బయట ఆఫ్ఘన్​ మహిళలకు బలవంతపు పెళ్లిళ్లు!

03-09-2021 Fri 13:15
  • ధ్రువీకరించిన అమెరికా అధికారులు
  • యూఏఈలోని క్యాంప్ లో ఓ యువతి వెల్లడి
  • ఎదురు డబ్బిచ్చి మరీ పెళ్లి చేసి పంపించిన తల్లిదండ్రులు
  • తాలిబన్ల దాష్టీకాలకు దూరంగా పంపివేత
  • మానవ అక్రమ రవాణ ముప్పుందన్న అమెరికా
Afghan Women Forced To Marry Outside Kabul Airport in Desperate Bid To Flee Country From Talibans
తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆఫ్ఘన్లు తమ దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఎన్నెన్ని పాట్లు పడ్డారో.. ఎన్ని ప్రయత్నాలు చేశారో మనం చూశాం. ముఖ్యంగా మహిళలు మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్లిపోవాలనుకున్నారు. కాబూల్ ఎయిర్ పోర్ట్ బాట పట్టారు. ఏ దేశమైనా తమను తీసుకుపోకపోతుందా? అని ఎదురు చూశారు.

అదే అదనుగా కొందరు మహిళలు, యువతులకు కాబూల్ ఎయిర్ పోర్ట్ బయటే బలవంతపు పెళ్లిళ్లు చేశారని అమెరికా అధికారులు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే చాలా మంది అమెరికాలో అలా అడుగు పెట్టారని స్పష్టం చేశారు. యూఏఈలోని అమెరికా దౌత్యవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారని చెప్పారు.

తరలింపుల సందర్భంగా కొందరిని యూఏఈలో ఏర్పాటు చేసిన క్యాంప్ నకు తీసుకొచ్చారు. అందులో ఉన్న కొందరు ఆఫ్ఘన్ యువతులు తమకు కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట బలవంతపు పెళ్లిళ్లు చేశారని చెప్పారు. కొందరికి ఆ పెళ్లిళ్లు ఇష్టం లేకపోయినా వారి భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు బలవంతంగా వారికిచ్చి వివాహం జరిపించారు. మరికొందరు తమ పిల్లలను దేశం దాటించడం కోసం అమెరికాకు వెళ్లేందుకు అర్హత ఉన్న వారికి ఎదురు డబ్బిచ్చి మరీ పెళ్లిళ్లు చేశారు. మరికొందరిని తమ పిల్లలకు భర్తలుగా నటించేందుకు ఒప్పందం చేసుకున్నారు.
 
అయితే, ఈ పెళ్లిళ్ల ముసుగులో మహిళల అక్రమ రవాణా జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే యూఏఈ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఇలాంటి బందిఖానాలో చిక్కిన ఆఫ్ఘన్ మహిళలను గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అమెరికా విదేశాంగ శాఖ, హోం ల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ శాఖలూ ఇలా అమెరికాకు వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డాయని చెబుతున్నారు.