Avani Lekhara: అవనీ లేఖర ఖాతాలో తాజాగా కాంస్య పతకం.. పారాలింపిక్స్​ లో రెండు పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా రికార్డ్​!

  • 50 మీటర్ల రైఫిల్ పోటీల్లో కాంస్య పతకం
  • అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వర్ణం
  • అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ
Avani Lekhara Scribes History In Paralympics By Winning Another Medal

పారాలింపిక్స్ లో అవనీ లేఖర చరిత్ర లిఖించింది. మరో పతకం సాధించింది. దీంతో ఒకే పారాలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా ఆమె తన పేరిట రికార్డు రాసుకుంది. 19 ఏళ్ల ప్రాయంలోనే ఆ రికార్డును సొంతం చేసుకుని అందరి చేత మన్ననలను పొందుతోంది. ఇవాళ జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్హెచ్1 విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని గెలిచింది. ఈ విభాగంలో చైనాకు చెందిన ఝాంగ్ క్యూపింగ్ స్వర్ణం సాధించింది. జర్మనీ క్రీడాకారిణి నటాషా హిల్ ట్రాప్ రజతం గెలిచింది.

కాగా, రెండో పతకం సాధించిన అవనికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అవని కాంస్య పతక ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.


అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని తన తొలి ఒలింపిక్స్ లోనే స్వర్ణాన్ని సాధించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. 2012లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్ లో జైపూర్ కు చెందిన ఆ అమ్మాయి వెన్నుపూస విరిగి చక్రాల కుర్చీకే పరిమితమైపోయింది. 1984 పారాలింపిక్స్ లో జోగిందర్ సింగ్ సోధి మూడు పతకాలు సాధించడమే ఇప్పటిదాకా రికార్డ్. ఆయన ఓ రజతం, రెండు కాంస్య పతకాలను గెలిచారు. షాట్ పుట్ లో రజతం సాధించిన ఆయన.. డిస్కస్ త్రో, జావెలిన్ త్రోల్లో కాంస్య పతకాలను గెలుచుకొచ్చారు.

More Telugu News