Hyderabad: హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షం.. మూడు గంటలపాటు అతలాకుతలం

  • మూడు గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షం
  • లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం
  • కృష్ణానగర్‌లో కొట్టుకుపోయిన కార్లు, బైకులు
  • నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు
Heavy rain lashed Hyderbad

హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన వాన నగర వాసులను వణికించింది. మూడు గంటలపాటు సైలెంట్‌గా కురిసిన వర్షం జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్లు, చెరువులకు తేడాలేకుండా పోయింది. మెహదీపట్నం, రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి.

కృష్ణానగర్‌లో అయితే, వరద నీటిలో కొట్టుకుపోకుండా పాదచారులను స్థానికులు దాటించాల్సి వచ్చింది. తోపుడుబండ్లు, ఆటోలు, బైక్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు రక్షించారు. దీంతో కొన్ని గంటలపాటు ప్రయాణికులు నరకం అనుభవించారు. మూసాపేట, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిపై వరద చేరడంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.  మూడు గంటల్లోనే 10 సెంటీమీటర్ల వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

More Telugu News