KCR: ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్

  • 1100 గజాల స్థలంలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం
  • వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
  • వచ్చే ఏడాది దసరాలోగా పూర్తి చేయాలని యోచన
Telangana CM KC Rao lays foundation stone for TRS Party office in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయ నిర్మాణ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. గురువారం నాడు ఢిల్లీ చేరిన కేసీఆర్.. వసంత్ విహార్‌లో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ భవన్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. మొత్తం 1100 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. దీంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో గులాబి పార్టీ కూడా చేరనుంది.

ఇక ఈ భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది దసరా నాటికి ఎలాగైనా పూర్తిచేయాలనేది కేసీఆర్ యోచన. అలాగే భవన ప్రారంభోత్సవానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడు రోజులు సాగనుంది.

More Telugu News