Andhra Pradesh: మంత్రి ఆదిమూలపు సురేశ్​ దంపతులపై ప్రాథమిక దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు  
  • 2017లో వారిపై కేసు బుక్ చేసిన సీబీఐ
  • ఏ1గా విజయలక్ష్మి, ఏ2గా మంత్రి సురేశ్
  •  సీబీఐ ఎఫ్ఐఆర్ ను కొట్టేసిన హైకోర్టు
  • సుప్రీంకోర్టుకి వెళ్లిన సీబీఐ.. నేడు విచారణ   
Supreme Court Asks CBI To File Fresh FIR Against AP Minister Suresh

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (మాజీ ఐఆర్ఎస్), ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారిణి విజయలక్ష్మిపై ప్రాథమిక దర్యాప్తు జరిపి తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఐఆర్ఎస్ గా పనిచేసిన ఆదిమూలపు సురేశ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ అధికారులపై సీబీఐ 2016లో దాడులు చేసింది. ఈ క్రమంలోనే 2017లో సురేశ్, ఆయన భార్య విజయలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో విజయలక్ష్మిని ఏ1గా, సురేశ్ ను ఏ2గా పేర్కొన్నారు.

అయితే, ప్రాథమిక దర్యాప్తు లేకుండానే కేసు నమోదు చేశారని మంత్రి సురేశ్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో పిటిషన్ ను ఇవాళ విచారించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం.. సివిల్ సర్వీసు అధికారులపై కేసు నమోదు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

ప్రాథమిక దర్యాప్తు అనంతరమే ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారని సీబీఐ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. మరి, వాటిని అఫిడవిట్ లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించిన ధర్మాసనం.. మళ్లీ ప్రాథమిక దర్యాప్తు జరిపి తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.  

More Telugu News