USA: టెక్సాస్ లో ఇక అనుమతులు అక్కర్లేదు.. తుపాకీ వెంటతెచ్చుకోవచ్చు.. అమలులోకి కొత్త చట్టం!

  • ఇవాళ్టి నుంచి అమల్లోకి చట్టం
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
  • వ్యతిరేకిస్తున్న పోలీస్ అధికారులు
  • ఏటేటా పెరిగిపోతున్న కాల్పుల ఘటనలు
  • ఈ ఏడాది టెక్సాస్ లో 14% పెరిగిన కాల్పులు
Texans Now Can Use Their Gun Openly

అమెరికాలో తరచూ ఎక్కడో ఒక చోట కాల్పులు జరిగి ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అంతెందుకు నార్త్ కరోలినాలో ఇవాళ ఓ విద్యార్థిని కాల్చి చంపేశాడో మరో విద్యార్థి. నార్త్ కరోలినాలోని మరో స్కూల్ లోనే వారం క్రితం ఇంకో షూటవుట్ జరిగి విద్యార్థి చనిపోయాడు. ఈ ఒక్కచోటే కాదు.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

అయినా సరే.. టెక్సాస్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాకులను వెంట తీసుకువెళ్లడానికి ఓకే అనేసింది. దానికి చట్టం కూడా చేసింది. ఇక ఎవరి అనుమతులూ లేకుండానే.. పేల్చడంలో శిక్షణ తీసుకోకుండానే తుపాకులను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకెళ్లచ్చు. తుపాకులను వెంట తీసుకెళ్లడం ‘రాజ్యాంగ హక్కు’ అంటూ రాష్ట్రం చట్టం చేసింది. ఇవాళ్టి నుంచే ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రతినిధుల సభలో ఈ చట్టం 82–62 ఓట్లతో ఆమోదం పొందింది. డెమోక్రాట్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా అది చట్ట రూపం దాల్చింది.

రాష్ట్ర ప్రభుత్వ చట్టంపైనే ఇప్పుడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తుపాకుల వాడకానికి అనుమతులే అక్కర్లేదనడం మూర్ఖపు చర్య అని ఎవ్రీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నిపుణుడు ఆండ్రూ కారోస్కీ అన్నారు. ఎవరినీ ఏమీ అడగకుండా, అనుమతులు లేకుండా ఎవరు పడితే వారు తుపాకులను కలిగి ఉండడమంటే అది అత్యంత ప్రమాదకరమైన విషయమన్నారు.

ఇటు అది తమకూ సవాల్ తో కూడుకున్నదేనని టెక్సాస్ పోలీస్ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఆస్టిన్, డాలస్, హ్యూస్టన్ పోలీసులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కనీస శిక్షణ కూడా అవసరం లేదనడం విడ్డూరమని డాలస్ పోలీస్ సంఘం అధ్యక్షురాలు గ్రేసియా మండిపడుతున్నారు. తుపాకులను విచ్చలవిడిగా వాడే వారిని నియంత్రించడం తమకు అత్యంత ప్రమాదకరమైన పని అని అన్నారు. తుపాకులను తీసుకునే వారు చాలా జాగ్రత్తగా వాటిని వినయోగించాలని, అత్యవసరమనుకున్న పరిస్థితుల్లోనే వాడాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

కాగా, గన్ వయొలెన్స్ ఆర్కైవ్ (జీవీఏ) అధ్యయనం ప్రకారం ఒక్క టెక్సాస్ రాష్ట్రంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే తుపాకీ కాల్పుల ఘటనలు 14 శాతం పెరిగాయి. ఇప్పటిదాకా 3,200 ఘటనలు జరిగాయి. 2020లో 2,800 షూటవుట్ లు, 2019లో 2,100 కాల్పుల ఘటనలు జరిగాయి. ఈ లెక్కన ఏటేటా కాల్పుల ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెచ్చిన చట్టంతో అవి మరింత పెరిగే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News