Cristiano Ronaldo: అంతర్జాతీయ ఫుట్‌‌బాల్‌లో 111 గోల్స్.. క్రిస్టియానో రొనాల్డో రికార్డు!

  • ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ అర్హత మ్యాచ్‌లో రెండు గోల్స్
  • ఇరాన్ మాజీ స్ట్రైకర్ అలీ దేయిని దాటేసిన రొనాల్డో
  • చొక్కా విప్పేసి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్
Cristiano Ronaldo becomes highest goal scorer

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర లిఖించాడు. ప్రపంచ కప్ అర్హత కోసం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పోర్చుగల్ స్టార్ రెండు గోల్స్ చేశాడు. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రొనాల్డో చేసిన గోల్స్ సంఖ్య 111కు చేరింది. పుట్‌బాల్ క్రీడలో ఇన్ని గోల్స్ మరే క్రీడాకారుడూ సాధించలేదు.

ఈ క్రమంలో ఐర్లాండ్‌పై పోర్చుగల్ జట్టు 2-1తో గెలుపొందింది. బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. దీనిలో 89వ నిమిషంలో ఒక గోల్ చేసిన రొనాల్డో.. ఆ తర్వాత ఆట మరో ఆరు నిమిషాలు ఉందనగా హెడర్‌తో రెండో గోల్ చేశాడు. చివరి గోల్ చేసిన అనంతరం ఆనందం పట్టలేక చొక్కా విప్పి ఎగిరి గంతులేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇంతకు ముందు అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇరాన్ మాజీ స్ట్రైకర్ అలీ దేయి (109) పేరిట ఉండేది. దీన్ని రొనాల్డో బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకూ 180 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో.. ఈ ఫీట్ సాధించాడు. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ మాట్లాడుతూ.. తనకెంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.

‘‘కేవలం రికార్డు బద్దలు కొట్టినందుకే నేను సంతోషంగా లేను. జట్టు సభ్యులంతా కలిసి ఎన్నో అనుభవాలను పంచుకున్నాం. ఆట చివర్లో రెండు గోల్స్ చేయడం అంటే మాటలు కాదు. అందుకే జట్టు మొత్తం చేసిన కృషిని అభినందిస్తున్నా. మేం గెలుస్తామనే చివరి వరకూ నమ్మాం’’ అని రొనాల్డో వెల్లడించాడు.

ఒక జట్టు తరఫున అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుల జాబితాలో.. రొనాల్డో (111) అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో అలీ దేయి (109), ముక్తార్ దహారి (89), ఫెర్నిస్ పుస్కస్ (84), గాడ్‌ఫ్రే చీటా(79) ఉన్నారు. టీమిండియా మాజీ సారథి సునీల్ ఛెత్రి (74) ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.

More Telugu News