Dale Steyn: క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్

  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న స్టెయిన్
  • 20 ఏళ్ల కెరీర్ కు నేటితో ముగింపు
  • సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు
  • ఒకప్పుడు నెంబర్ వన్ పేసర్ గా స్టెయిన్
South Africa pacer Dale Steyn announced official retirement from game

ప్రపంచస్థాయిలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుప్రతిష్ఠలు అందుకున్న దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఎన్నో మధురస్మృతుల నడుమ, కొంత బాధ ఉన్నప్పటికీ, తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆట నుంచి అధికారికంగా వైదొలగుతున్నానని స్టెయిన్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. 20 ఏళ్ల కెరీర్ నేటితో ముగిసిందని తెలిపాడు.

ఇన్నేళ్ల కాలంలో శిక్షణ, మ్యాచ్ లు, ప్రయాణాలు, అలసట, విజయాలు, పరాజయాలు, ఆనందాలు, సోదర ప్రేమ ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఎంతోమందికి కృతజ్ఞతలు చెప్పాలని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా స్టెయిన్ తనకిష్టమైన మ్యూజిక్ బ్యాండ్ 'కౌంటింగ్ క్రోస్' హిట్ సాంగ్ 'లాంగ్ డిసెంబర్' పాటలోని కొన్ని పంక్తులను ఉదహరించాడు.

ఈ అద్భుత క్రికెట్ ప్రస్థానంలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, పాత్రికేయులకు, అభిమానులకు... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్టులాడి 439 వికెట్లు సాధించాడు. వాటిలో అత్యుత్తమం 7/51. వన్డేల్లో 125 మ్యాచ్ లాడి 196 వికెట్లు, టీ20 అంతర్జాతీయ పోటీల్లో 47 మ్యాచ్ ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తోనూ స్టెయిన్ కు అనుబంధం ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, డెక్కన్ చార్జర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఒకప్పుడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగిన స్టెయిన్ కాలక్రమంలో గాయాలబారినపడ్డాడు. పలు సర్జరీల అనంతరం ఆటలో మళ్లీ అడుగుపెట్టినా, మునుపటి వాడి లోపించింది. దానికితోడు గాయాలు తిరగబెట్టడం కూడా స్టెయిన్ ప్రతిష్ఠను మసకబార్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది.

More Telugu News