పోలవరం నిర్వాసితులను కలిసేందుకు వెళ్తూ.. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న నారా లోకేశ్

31-08-2021 Tue 16:12
  • కరోనా కష్టాలు తొలగిపోవాలని స్వామిని కోరుకున్నానన్న లోకేశ్
  • రెండు రాష్ట్రాలు సఖ్యంగా ఉండాలని ఆకాంక్ష
  • పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలని మొక్కుకున్నానన్న లోకేశ్ 
Nara Lokesh visits Bhadrachalam temple
పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈరోజు పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో నిర్వాసితులతో భేటీ అయ్యారు. అక్కడకు వెళ్లే ముందు భద్రాద్రి రామయ్యని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తూ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నానని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో... కరోనా కష్టాలు కడతేరాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండి పరస్పర ప్రయోజనాలను గౌరవించుకుని, ప్రగతిపథంలో సాగాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రామయ్యకు మొక్కుకున్నానని తెలిపారు.