Gujarath: జైల్లో వుండడం కోసం.. పోలీస్​ స్టేషన్​ కు నిప్పుపెట్టిన యువకుడు!

Young Man Set Police Station On Ablaze Over Wife Harassments
  • గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
  • తిండి కూడా పెట్టట్లేదన్న యువకుడు
  • దానికన్నా జైలే నయమని పోలీసులకు చెప్పిన వైనం
  • సమాధానం విని నిశ్చేష్టులైన పోలీసులు
23 ఏళ్ల యువకుడు భార్య వేధింపులు భరించడం కన్నా.. జైలులో ఉండడం మేలు అనుకున్నాడు. పెట్రోల్, అగ్గిపెట్టె పట్టుకుని నేరుగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. స్టేషన్ కు నిప్పు పెట్టేశాడు. పారిపోకుండా అక్కడే నిలబడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లోని రాజీవ్ నగర్ లో జరిగింది. పోలీసులు నిందితుడు దేవ్ జీ చావ్దాను అరెస్ట్ చేశారు.

అదృష్టవశాత్తూ స్టేషన్ లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎందుకిలా చేశావంటూ దేవ్ జీని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘ఇంట్లో నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా. తిండి కూడా పెట్టట్లేదు. దానికన్నా జైలే నయమనిపించింది. రోజూ తిండి పెడతారు. చేసుకోవడానికి పనిస్తారు. అందుకే జైలుకెళ్దామనుకుని ఆలోచించి.. స్టేషన్ కు నిప్పుపెట్టా’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ సమాధానం విన్న పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఘటన జరిగినప్పుడు స్టేషన్ కు తాళం వేసి ఉంది. మంటలను గమనించిన స్థానిక వ్యాపారులు ఆర్పేశారు. పోలీసులకు సమాచారమివ్వడంతో బయటకు వెళ్లిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటిదాకా అతడు పారిపోకుండా అక్కడే ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Gujarath
Crime News
Police
Police Station
Rajkot

More Telugu News