Amara Raja Group: ‘అత్యంత శక్తిసామర్థ్య యూనిట్‌’ పురస్కారాన్ని అందుకున్న ‘అమరరాజా’

  • సంస్థలోని చిన్న బ్యాటరీల ప్లాంట్‌కు మరో అవార్డు
  • ఈ నెల 24 -27 మధ్య 30 మంది న్యాయనిర్ణేతల పర్యవేక్షణలో పోటీలు
  • పోటీపడిన 400 పరిశ్రమలు
Amara Raja Batteries bags the Excellent Energy Efficient Unit award

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన 22వ జాతీయ అవార్డుల పోటీల్లో అమరరాజా బ్యాటరీస్‌కు ‘అత్యంత శక్తి సామర్థ్య యూనిట్ (ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్) పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా 9 విభిన్న రంగాల నుంచి 400 పరిశ్రమలు పోటీ పడగా ఈ నెల 24 నుంచి 27 వరకు వర్చువల్ సమావేశం ద్వారా 30 మంది న్యాయ నిర్ణేతల పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో చిత్తూరు జిల్లాలోని అమరరాజా గ్రోత్ కారిడార్‌లో ఉన్న ఆటోమోటివ్ యూనిట్‌కు ఇంజినీరింగ్ కేటగిరీ కింద ఈ అవార్డు లభించింది. అలాగే, అదే సంస్థకు మరో అవార్డు కూడా దక్కింది. అమరరాజా బ్యాటరీస్‌లోని చిన్న బ్యాటరీల డివిజన్ ప్లాంట్‌కు ‘ఇన్నోవేటివ్ ప్రాజెక్టు అవార్డు’ లభించింది. న్యూమాటిక్ సిలిండర్ సైజు ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా ఈ అవార్డును కైవసం చేసుకుంది. సీఐఐ నుంచి రెండు అవార్డులు లభించడంపై సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సి.నరసింహులు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News