Corona Virus: భయపెట్టే కొత్త కరోనా వేరియంట్.. వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే సామర్థ్యం!

  • శాస్త్రవేత్తలను భయపెడుతున్న c.1.2 కరోనా వేరియంట్
  • తొలిసారి దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్
  • ఆగస్టు 13 నాటికి చైనా సహా మరిన్ని దేశాల్లో వ్యాప్తి
  • మిగతా వేరియంట్ల కన్నా ఎక్కువగా జన్యుమార్పులు
The frightening new corona variant the ability to escape vaccines

ఇప్పటికే రకరకాల వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరో కొత్త కరోనా వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. c.1.2గా పిలుస్తున్న ఈ కరోనా వేరియంట్ ఈ ఏడాది మే నెలలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిందట. ఆగస్టు 13 నాటికి చైనా, స్విట్జర్లాండ్, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్ తదితర దేశాలకూ ఈ వేరియంట్ వ్యాపించింది.

కరోనా మొదటి వేవ్ సమయంలో దక్షిణాఫ్రికాలో విజృంభించిన c.1 కరోనా వేరియంట్.. మరిన్ని జన్యుమార్పులు జరగడంతో c.1.2గా మారినట్లు నిపుణులు వివరిస్తున్నారు. ఈ వేరియంట్‌ను మే నెలలో తొలిసారిగా గుర్తించినట్లు దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్ఐసీడీ), క్వాజులూ-నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫాం(కేఆర్ఐఎస్‌పి) సంస్థలు ప్రకటించాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్లతో పోలిస్తే.. ఈ కొత్త వేరియంట్‌లో మరిన్ని ఎక్కువ జన్యుమార్పులు (మ్యూటేషన్లు) జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డేటాను బట్టి ఈ వేరియంట్ వ్యాప్తిని, ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమని అంటున్నారు. ఇప్పటికే పరిశోధకులు గుర్తించిన ఎన్440కె, వై449హెచ్ వంటి మ్యూటేషన్లు.. వ్యాక్సిన్ తీసుకుంటే మన శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

ఇప్పుడు బయటపడిన c.1.2 వేరియంట్లో కూడా ఈ సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే c.1.2లో రెట్టింపు వేగంతో జన్యుమార్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News