వికటించిన ఫైజర్ వ్యాక్సిన్.. మహిళ మృతి

30-08-2021 Mon 14:28
  • న్యూజిలాండ్ లో ఫైజర్ వ్యాక్సిన్ వల్ల తొలి మరణం
  • మయోకార్డిటిస్ తో చనిపోయినట్టు భావిస్తున్నామన్న న్యూజిలాండ్ ప్రభుత్వం
  • ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్య
Woman dies with pfizer vaccine reaction
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు కూడా చెపుతున్నారు. అయితే, వ్యాక్సిన్ వికటించి పలుచోట్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె అత్యంత అరుదైన మయోకార్డిటిస్ (గుండె కండరాల్లో ఇన్ఫ్లమేషన్)తో చనిపోయినట్టు భావిస్తున్నట్టు న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వ్యాక్సిన్ వల్ల తమ దేశంలో సంభవించిన తొలి మరణం ఇదేనని చెప్పింది. అయితే, సదరు మృతురాలు ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ వల్ల అనర్థాల కంటే ఉపయోగాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పింది.