Stuart Binny: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన స్టువర్ట్ బిన్నీ.. వన్డేల్లో ఆ రికార్డులు ఇప్పటికీ బిన్నీవే!

Stuart Binny retires from international cricket
  • ఇండియా తరపున 23 మ్యాచులు ఆడిన బిన్నీ
  • బంగ్లాదేశ్ పై 4 పరుగులకే 6 వికెట్లు తీసిన ఘనత
  • బీసీసీఐ తనను ఎంతో ప్రోత్సహించిందని వ్యాఖ్య
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని, తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. టీమిండియా తరపున స్టువర్ట్ బిన్నీ 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 95 మ్యాచులు ఆడిన బిన్నీ 4,796 పరుగులు చేసి, 146 వికెట్లు పడగొట్టాడు.

2014లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో కేవలం 4 పరుగులకే 6 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్ లో భారత్ కు ఘోర ఓటమి తప్పదనుకుంటున్న తరుణంతో... బంతితో మాయాజాలం చేసి, బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. వన్డేల్లో భారత్ తరపున అత్యున్నత బౌలింగ్ గణాంకాలు స్టువర్ట్ బిన్నీ పేరిటే ఉన్నాయి. భారత క్రికెట్ దిగ్గజం రోజర్ బిన్నీ కుమారుడే స్టువర్ట్ బన్నీ. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయాంతి లాంగన్ ను ఆయన పెళ్లాడాడు.

అంతర్జాతీయ క్రికెట్లో మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా బావిస్తున్నానని తన ప్రకటనలో బిన్నీ తెలిపాడు. తన క్రికెట్ కెరీర్లో బీసీసీఐ అద్భుతమైన పాత్రను పోషించిందని చెప్పాడు. తనపై ఇంతకాలం పాటు నమ్మకాన్ని ఉంచి, ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు.

ఇక కర్ణాటక సహకారం లేకపోతే తన క్రికెట్ కెరీర్ ప్రారంభమయ్యేది కాదని, తన రాష్ట్రానికి కెప్టెన్ గా వ్యవహరించడం, ట్రోఫీలను గెలుపొందడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. తనను ప్రోత్సహించిన కోచ్ లు, సెలక్టర్లకు ధన్యవాదాలు చెపుతున్నానని, అలాగే తనపై నమ్మకం ఉంచిన కెప్టెన్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. తన కుటుంబ సహకారం లేకపోతే తాను ఇంత సాధించే వాడిని కాదని అన్నాడు.
Stuart Binny
bcci
Team India
Retirement

More Telugu News