శ్మశానంలో చదువు.. శవాల పక్కనే ఆన్‌లైన్ క్లాసులు
- మొన్న కర్ణాటక.. ఇప్పుడు తెలంగాణ
- కొవిడ్ దెబ్బకు అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు
- పల్లెల్లో పరిస్థితి మరింత దయనీయం
- కల్పన పరిస్థితే నిలువెత్తు నిదర్శనం
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఇంటర్నెట్ సిగ్నల్స్ లేకపోవడం, విద్యుత్ కోతలు. గతంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొండ ప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్ కాసులకు హాజరైన విషయం గత నెలలో బయట పడిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. జగిత్యాల జిల్లాలో ల్యాల మండలం, సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన అనే వైద్య విద్యార్థిని ఏకంగా శ్మశానంలో విద్యాభ్యాసం చేస్తోంది. 2017లో ఎంసెట్ పరీక్ష రాసిన కల్పన.. ఆల్ ఇండియా 698 ర్యాంకు సాధించింది. ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో చేరింది. అయితే కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటోంది. అక్కడి నుంచే ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. స్వగ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడంతో సమీపంలోని శ్మశానానికి వెళ్లి ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. శ్మశానంలో ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న కల్పనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దీనిపై కల్పన మాట్లాడుతూ.. తనకు కుటుంబసభ్యులు సహకారం ఇస్తున్నారని..అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసుల కోసం ఇబ్బంది పడుతున్న తనలాంటి వారి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని.. సిగ్నల్స్ వచ్చేలా చేయాలని కోరుతోంది.