Cowin: కరోనా టెస్టు ఫలితం కొవిన్ యాప్‌లో.. విదేశీ ప్రయాణాలు సులభతరం చేసేందుకే!

  • నేషనల్ హెల్త్ అథారిటీ యోచన
  • వెల్లడించిన ఎన్‌హెచ్ఏ చీఫ్ ఆర్ఎస్ శర్మ
  • వ్యాక్సిన్ పాస్‌పోర్టులా కొవిన్ యాప్
  • విదేశాలు ఒప్పుకుంటాయా? అన్న అనుమానం
Corona test result in Covin app to facilitate overseas travel

విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు కచ్చితంగా కరోనా కోసం ఆర్‌టి-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందేనని దాదాపు అన్ని దేశాలూ నిబంధనలు విధించాయి. ఈ క్రమంలో ఈ టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్‌కు జత చేయాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. దీనివల్ల సదరు వ్యక్తి భారత ప్రభుత్వం ఆమోదించిన కరోనా టెస్టు చేయించుకున్నట్లు స్పష్టం అవుతుందని ఆయన వివరించారు. ఈ నిర్ణయం అమలు చేయడం కోసం ఐసీఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)తో చేతులు కలిపినట్లు శర్మ తెలిపారు.

పలు దేశాలకు ప్రయాణించే వారు, తమ ప్రయాణానికి 72 నుంచి 96 గంటలలోపు ఆర్‌టి-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ ఇలా కొవిన్ యాప్‌ను వ్యాక్సిన్ పాస్‌పోర్టుగా విదేశాలు అంగీకరిస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా మాట్లాడిన శర్మ.. అన్నిదేశాలకు సంబంధించిన డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను డిజిటల్ పాస్‌పోర్టులుగా ఆమోదించే ప్రయత్నాలు గతంలో జరిగాయని తెలిపారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రస్తుతం ఈ విషయంలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ‘‘మా డిజిటల్ పాస్‌పోర్టును అంగీకరిస్తే.. మీ డిజిటల్ పాస్‌పోర్టును కూడా ఆమోదిస్తాం’’ వంటి ఒప్పందాలు దేశాల మధ్య జరుగుతున్నట్లు చెప్పారు.

More Telugu News