Adilabad District: 'న‌న్ను దేవుడే కాపాడ‌తాడు.. ఆసుప‌త్రికి వెళ్ల‌ను' అంటూ మొండిచేస్తోన్న గ‌ర్భిణి

  • ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ‌లంలో ఘ‌ట‌న‌
  • మ‌హిళ‌కు హైబీపీ
  • శిశువు ప్రాణాల‌కు ముప్పు
  • అయినా మూఢ‌న‌మ్మ‌కాన్ని వ‌ద‌ల‌ని మ‌హిళ‌
woman dont want to join in hospital

మూఢ‌న‌మ్మ‌కాలు... భార‌త దేశాన్ని శ‌తాబ్దాలుగా వేధిస్తోన్న స‌మ‌స్య ఇది. ప్ర‌స్తుత‌ కంప్యూట‌ర్ యుగంలోనూ చాలా మంది మూఢన‌మ్మ‌కాల వ‌ల నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ‌లం మహగావ్‌ శేకుగూడ గ్రామంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న దేశంలో ఇప్ప‌టికీ మూఢ‌న‌మ్మ‌కాలు ఎంతగా ఉన్నాయో తెల‌ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

ఎం. రేణుకబాయి అనే మ‌హిళ ఎనిమిది నెలల గర్భవతి. గ‌తంలో మొదటి రెండు కాన్పుల్లో ఆమెకు హైబీపీ కారణంగా అబార్షన్‌ జరిగింది. మూడో కాన్పు అయినా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని ఈ నెల 26న ఉట్నూర్‌ సామాజిక ఆసుప‌త్రిలో ఆమె వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంది.

ఆమెకు మెరుగైన వైద్యం అందాల్సి ఉంద‌ని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు వెళ్లాల‌ని వైద్యులు సూచించారు. ఆసుప‌త్రికి వెళ్లేందుకు రేణుకబాయి ఒప్పుకోలేదు. వైద్యులు ఎంత‌గా చెప్పిన‌ప్ప‌టికీ ఆమె ఆసుప‌త్రిలో చేర‌డానికి ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్లిపోయింది. దీంతో తహసీల్దార్‌ దుర్వా లక్ష్మణ్ ఆమె ఇంటికి చేరుకుని గోండ్‌ భాషలో నచ్చజెప్పడానికి ప్ర‌య‌త్నించారు.

దీంతో ఆమె చెప్పిన స‌మాధానం విని షాక్ అవ్వ‌డం అంద‌రి వంతు అయింది. తాను దేవుడికి మొక్కుకున్నానని ఆమె చెప్పింది. దేవుడే త‌న‌ను కాపాడుతాడని ఆసుప‌త్రికి వెళ్ల‌బోన‌ని తెలిపింది. ఆమెకు హైబీపీ ఉండ‌డంతో ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని ఆసుప‌త్రికి వెళ్లాల‌ని ఎంత మంది న‌చ్చ‌జెప్పినా ఆమె విన‌లేదు.

అంద‌రూ క‌లిసి ఆమెకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డంతో రేణుకబాయి త‌న ఇంటి నుంచి గ్రామంలోని వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. చివ‌ర‌కు ఆమె ఆసుప‌త్రిలో చేర‌లేదు. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.


More Telugu News