West Godavari District: ప్రియుడితో పెళ్లి చేస్తారా.. దూకేయమంటారా?: వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్‌చల్

Young Girl Climb Water Tank for Marry with Boy Friend
  • పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘటన
  • ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
  • ప్రియుడిని ఒప్పించి ఇద్దరికీ పెళ్లి చేసిన పోలీసులు
ప్రియుడితో తన పెళ్లి చేయకుంటే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకేస్తానంటూ యువతి హల్‌చల్ చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బెత్లహాంపేటకు చెందిన పెట్టెల కేశవాణి తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్‌ను ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. రెండు రోజుల క్రితం భాస్కర్ వద్ద యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిన్న స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది.

భాస్కర్‌తో తనకు వివాహం చేయకుంటే పైనుంచి దూకేస్తానని హెచ్చరిస్తూ కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియో పంపింది. అది చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్‌లో మాట్లాడారు. భాస్కర్‌ను తీసుకొచ్చి వివాహానికి ఒప్పించారు. దీంతో కేశవాణి కిందికి దిగింది. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఇద్దరికీ వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది.
West Godavari District
Palkollu
Love
Andhra Pradesh

More Telugu News