Bandi Sanjay: గొర్రెలు, బర్రెలు బీసీలకు.. పాలనా పగ్గాలు మాత్రం కేసీఆర్‌కా?: బండి సంజయ్

  • ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్
  • ఈ యాత్రతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు తథ్యమన్న బండి
  • కేసీఆర్‌ను ఇంటికి సాగనంపాలని పిలుపు
  • మజ్లిస్‌ది తాలిబన్ భావజాలమంటూ నిప్పులు
Bandi Sanjay slams kcr and mim

‘‘గొర్రెలు, బర్రెలు బీసీలకు ఇచ్చి పాలనా పగ్గాలు మాత్రం కేసీఆర్ ఉంచుకుంటారా? ఈ దెబ్బతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు ఖాయం’’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చార్మినార్ వద్ద నిర్వహించిన సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.  కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇంటికో ఉద్యోగం, రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేకపోవడంతో డిగ్రీ, పీజీలు చదివినవారు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 లక్షల మంది డీఎస్సీ కోసం ఎదురుచూస్తుంటే, 40 లక్షల మంది ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజిలో నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి కనుసన్నల్లో జరుగుతున్న ఈ యాత్రతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల వేళ దొంగ హామీలిచ్చి ఆ తర్వాత ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యే సీఎం కేసీఆర్‌ను ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రంజాన్ వస్తే ఇఫ్తార్ విందు, క్రిస్మస్‌కు భోజనాలు పెట్టడాన్ని బీజేపీ సమర్థిస్తుందని, కానీ హిందువుల పండుగలు టీఆర్ఎస్‌కు పట్టకపోవడం బాధాకరమన్నారు. తాలిబన్ భావజాలమున్న మజ్లిస్ పార్టీని, దానికి సహకరిస్తున్న వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే బీజేపీ లక్ష్యం కావాలన్నారు. పాతబస్తీ నుంచి వెళ్లిపోయిన ముస్లింలందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులు, అవినీతి నియంత కేసీఆర్ గుండెలు బద్దలయ్యేలా నినదించాలని బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

More Telugu News