Supreme Court: ప్రభుత్వ అసత్యాలను బయటపెట్టడం విజ్ఞుల బాధ్యత: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్

  • వాస్తవాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకూడదని సూచన
  • ఎటువంటి ప్రలోభాలకూ గురికాని మీడియా ప్రధానం
  • చాలా దేశాల్లో కొవిడ్-19 డేటా దాచే యత్నం: జస్టిస్ చంద్రచూడ్
Intellectuals Have A Duty To Expose Lies Of State says Supreme Court Judge

ప్రభుత్వం చెప్పే అవాస్తవాలను బట్టబయలు చేసే బాధ్యత విజ్ఞులందరిపైనా ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు 6వ చీఫ్ జస్టిస్‌గా సేవలందించిన జస్టిస్ ఎంసీ చాగ్లా స్మారక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, అవాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వంపై ఒక కన్నేసి ఉంచడం చాలా ముఖ్యమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వాస్తవాలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడకూడదని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జాబితాలో వైద్యపరమైన అంశాలకు సంబంధించిన నిజాలు చూడా చేరాయని చెప్పారు.

‘‘వాస్తవాల కోసం ప్రభుత్వంపైనే పూర్తిగా ఆధారపడకూడదు. నిరంకుశ ప్రభుత్వాలు తమ అధికారాన్ని నిబెట్టుకోవడం కోసం అనేక అబద్ధాలు చెప్పిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కొవిడ్-19 డేటాను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

కరోనా వైరస్ ఎంతలా వ్యాపించిందనే విషయాన్ని దాచడం కోసం పలు దేశాలు కొవిడ్-19 డేటాను మారుస్తున్నాయని కొందరు నిపుణులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం కరోనా సమయంలో పేట్రేగుతున్న ఫేక్ న్యూస్ విషయంలో ఆందోళన చెందిందన్న అంశాన్ని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో వస్తున్న ఈ దొంగ వార్తలను ‘ఇన్ఫోడెమిక్’గా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

 ఈ విషయాన్ని ప్రస్తావించిన జస్టిస్ చంద్రచూడ్.. ప్రజలు సాధారణంగానే సంచలన వార్తలకు ఆకర్షితులవుతారని, వీటిలో అధికభాగం బూటకాలేనని పేర్కొన్నారు. అదే విధంగా ఎటువంటి ప్రలోభాలకూ తలొగ్గని మీడియా ప్రాముఖ్యతను కూడా జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. గవర్నమెంటు నిర్ణయాలు, విధానాలకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయడంలో మీడియా పాత్ర కీలకమని ఆయన అన్నారు.

More Telugu News