Supreme Court: మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫ్యూచర్ గ్రూప్

  • అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలు సరికావని వాదన
  • రిలయన్స్‌తో డీల్ అమలయ్యేలా ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి
  • 35 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని ఆందోళన
future files new case against amazon in apex court

రిలయన్స్ గ్రూపుతో కుదిరిన డీల్‌పై ఫ్యూచర్ గ్రూప్ సంస్థ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్‌తో తమ డీల్ అమలయ్యేలా తీర్పు ఇవ్వాలని కోరింది. లేదంటే సంస్థలో పనిచేస్తున్న 35 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ డీల్ అమలయ్యేలా చేసేందుకు ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దీనికి అడ్డంకిగా ఉన్న చట్టపరమైన సమస్యలను అధిగమించేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి దేశపు అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ మధ్య 24,731 కోట్ల డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ సంగతి తమకు తెలియదని పేర్కొంటూ అమెజాన్ సంస్థ అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ అభ్యంతరాలు సరైనవి కావంటూ ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది.
 
ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్‌కు కూడా వాటా ఉంది. అయినా సరే అమెజాన్‌ను సంప్రదించకుండా ఈ డీల్ చేసుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ 2020 ఆగస్టులోనే ప్రకటించింది. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొంటూ అమెజాన్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అక్కడితో ఆగకుండా సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌(ఐఓసీ)ను ఆశ్రయించింది. ఈ కేసును పరిశీలించిన ఐఓసీ అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్.. ఢిల్లీ హైకోర్టులో పిల్ వేసింది. అయితే ఈ కోర్టు కూడా అమెజాన్‌కు అనుకూలంగానే తీర్పిచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ కోర్టు తీర్పును సమర్థించింది.

More Telugu News