'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు

28-08-2021 Sat 15:14
  • సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రం
  • నిన్న విడుదల.. హీరోయిన్ గా ఆనంది
  • కరుణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించిన మహేశ్
Mahesh Babu appreciates Sridevi Soda Center unit
సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ (పలాస 1978 ఫేమ్) దర్శకత్వంలో వచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రం నిన్న రిలీజైంది. ఈ చిత్రాన్ని తన నివాసంలోనే వీక్షించిన మహేశ్ బాబు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

"శ్రీదేవి సోడా సెంటర్ ఓ నికార్సయిన చిత్రం. క్లైమాక్స్ అదిరిపోయింది. 'పలాస 1978' తర్వాత కరుణకుమార్ మరో మంచి సినిమా తీసుకువచ్చాడు. సుధీర్ బాబు నటన అమోఘం! ఇప్పటివరకు అతడి నుంచి వచ్చిన అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ ఇదే" అంటూ కితాబునిచ్చారు.

అంతేకాదు, నరేశ్ మరోసారి అలరించారని, తన పాత్రను ఎంతో సునాయాసంగా పోషించారని ప్రశంసించారు. హీరోయిన్ ఆనందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, శ్రీదేవి క్యారెక్టర్ కు ఆమె సరిగ్గా సరిపోయిందని మహేశ్ బాబు వివరించారు. కెమెరా పనితనం ఆకట్టుకునేలా ఉందని, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్రబృందానికి మరోసారి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.