Rewanth Reddy: డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • విచారణకు ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు
  • రహస్యంగా కేటీఆర్ గోవా ఎందుకెళ్లారంటూ ప్రశ్న
  • హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేసిన కాంగ్రెస్ నేత
  • రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయన్నదే నా ఆందోళన: రేవంత్
Rewanth Reddy sensational remarks in drugs case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటని హైకోర్టు పదే పదే ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని రేవంత్ అడిగారు. నాలుగేళ్ల క్రితం ఈ కేసును డీల్ చేసిన ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఈ కేసును మధ్యలో వదిలేశారని, ఆయన్ను బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ ప్రశ్నించారు.

ఈ విషయంలో తాను హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన టీపీసీసీ చీఫ్.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ విచారణ జరపాలని తాను కోరినట్లు చెప్పారు. ఈ సంస్థలు తమకు కేసు విచారణలో సహకారం అందడం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యంతోనే ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చాయని తెలిపిన రేవంత్.. ఈ కేసులో ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితుల ప్రమేయం ఉందా? అని నిలదీశారు. అదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రహస్యంగా గోవా ఎందుకు వెళ్లారని రేవంత్ ప్రశ్నించారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా ఈడీ నోటీసులు ఇవ్వదని చెప్పిన ఆయన.. ఆర్థిక లావాదేవీలు ఏ రాష్ట్రం నుంచి జరిగాయనే అంశాలు విచారణలో బయటపడతాయన్నారు.

కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటన్నారు. అయితే తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదని, రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనేదే తన ఆందోళన అని రేవంత్ స్పష్టంచేశారు.

More Telugu News