Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి.. రాష్ట్రాలకు కేంద్ర మంత్రి లేఖ

  • సీఎంలు, మంత్రులు ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించాలని సూచించిన ఆర్‌కే సింగ్
  • ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే
  • ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రచారంతోపాటు కాలుష్య నివారణ కూడా
  • కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ కీలక సూచన
Use only electric vehicles Union Ministers letter to the states

కాలుష్య నివారణలో ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణ వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు వాతావరణానికి చాలా నష్టాన్ని కలిగిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఈ ఈవీలకు మరింత ప్రచారం కల్పించేందుకు కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ నిర్ణయించింది.

ఈ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్.. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు దీనిపై తాజాగా ఒక లేఖ రాశారు. వీరంతా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, అందరూ ఈవీలను ఉపయోగిస్తే బాగుంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరంతా డీజిల్, పెట్రోల్ ఇంజిన్ వాహనాలనే ఉపయోగిస్తున్నారు. వీటికి బదులుగా ఈవీలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి కోరారు.

అలాగే, ఆయా శాఖల వారీగా ఉపయోగించే వాహనాలను కూడా ఈవీలకు మార్చాలని సూచించారు. సాధ్యమైనంత వరకూ అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈవీలనే ఉపయోగించాలని చెప్పారు. కాగా, సాధారణంగా సీఎంల కాన్వాయ్‌లో పదికిపైగా వాహనాలు ఉంటాయి. మంత్రుల కాన్వాయ్‌లో ఐదు వాహనాల వరకూ ఉంటాయి. వీటన్నింటినీ ఈవీలుగా మార్చేస్తే.. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రచారం జరగడంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంత అడ్డగించినట్లే అని కొందరు అంటున్నారు.

More Telugu News