Sonu Sood: ‘దేశ్‌ కా మెంటర్‌’ అంబాసిడర్‌గా సోనూసూద్‌ ను నియమించిన కేజ్రీవాల్

  • విద్యార్థుల భవిష్యత్తు కోసం తగు సలహాలను ఇచ్చేందుకు కొత్త కార్యక్రమం
  • ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయాలపై గైడెన్స్
  • సోనుతో రాజకీయాలు మాట్లాడలేదన్న కేజ్రీవాల్
Kejriwal appoints Sonu Sood as brand ambassador for Desh ka Mentor programme

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎందరో పాలిట సినీ నటుడు సోనూసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. తన సొంత డబ్బుతో ఎందరికో అండగా నిలిచి శహభాష్ అనిపించుకున్నాడు. ఆయన సేవలను కొనియాడని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు.

ఈ నేపథ్యంలో తాజాగా సోనూసూద్ కు ఢిల్లీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తున్న 'దేశ్ కా మెంటార్' కార్యక్రమానికి సోనును బ్రాండ్ అంబాసడర్ గా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈరోజు కేజ్రీవాల్ తో సోను భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. అనేక మంది విద్యార్థులకు తమ భవిష్యత్తుపై సరైన అవగాహన ఉండదని... ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయాల గురించి తెలియదని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు తగు సూచనలు, సలహాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించడానికి సోను ఒప్పుకోవడం సంతోషకరమని చెప్పారు. సోనుతో తాను రాజకీయాల గురించి చర్చించలేదని తెలిపారు.

More Telugu News