కాబూల్ పేలుళ్లపై ప్రపంచమంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది: భారత్

27-08-2021 Fri 10:32
  • హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్టు వద్ద పేలుళ్లు
  • ఆత్మాహుతి దాడులు జరిపిన ఐసిస్
  • ఇప్పటివరకు 90 మంది మృతి
  • ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఉపేక్షించరాదన్న భారత్
India stated that whole world will be united after Kabul terror blasts
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ దారుణాన్ని తాము ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం సంఘటితం కావాల్సిన అవసరాన్ని ఈ పేలుళ్ల ఘటన చాటుతోందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఉపేక్షించరాదన్న విషయం ఈ ఘటన ద్వారా బోధపడుతోందని పరోక్షంగా పాకిస్థాన్ కు చురకలంటించింది. కాబూల్ పేలుళ్ల ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రగాఢ సంతాపం తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.