కాబూల్ పేలుళ్ల ఘటనలో 90కి పెరిగిన మృతుల సంఖ్య

  • నిన్న పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
  • ఎయిర్ పోర్టు గేటు, హోటల్ వద్ద పేలుళ్లు
  • తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్
  • ప్రతీకారం తప్పదన్న బైడెన్
More casualties at Kabul airport

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో నిన్న జరిగిన జంటపేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 90కి పెరిగింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గేటు వద్ద జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దాడులు జరగడం తెలిసిందే. తొలి పేలుడు ఎయిర్ పోర్టులోని అబ్బే గేటు వద్ద జరగ్గా, రెండో పేలుడు బేరన్ హోటల్ వద్ద చోటుచేసుకుంది.

మృతుల్లో అమెరికా మెరైన్ కమాండోలు కూడా ఉండడం పట్ల పెంటగాన్ వర్గాలు ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో అమెరికా అధినాయకత్వాన్ని రెచ్చగొట్టే చర్యగా రక్షణ రంగ నిపుణులు ఈ పేలుళ్లను అభివర్ణిస్తున్నారు. ఈ ఘాతుకం తమ పనే అని ఐసిస్ ఇప్పటికే ప్రకటించుకుంది.

నిజానికి ఈ పేలుడు ఘటనపై అమెరికా నిఘా వర్గాలు ముందే అప్రమత్తం అయ్యాయి. ఘటనకు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. అయితే, ఈ ఘటనకు కారకులపై ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా, అది ఏ రూపంలో అన్నది స్పష్టత రాలేదు. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా బలగాలు కొనసాగడం అనేది ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఐసిస్ పై బైడెన్ ప్రతీకారం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News